నారసింహ శతకమ్
001
సీ. శ్రీమనోహర | సురా - ర్చిత సింధుగంభీర |
భక్తవత్సల | కోటి - భానుతేజ |
కంజనేత్ర | హిరణ్య - కశ్యపాంతక | శూర |
సాధురక్షణ | శంఖ - చక్రహస్త |
ప్రహ్లాద వరద | పా - పధ్వంస | సర్వేశ |
క్షీరసాగరశాయి | - కృష్ణవర్ణ |
పక్షివాహన | నీల - భ్రమరకుంతలజాల |
పల్లవారుణపాద - పద్మయుగళ |
తే. చారుశ్రీచందనాగరు - చర్చితాంగ |
కుందకుట్మలదంత | వై - కుంఠధామ |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
002
సీ. పద్మలోచన | సీస - పద్యముల్ నీ మీద
జెప్పబూనితినయ్య | - చిత్తగింపు
గణ యతి ప్రాస ల - క్షణము జూడగలేదు
పంచకావ్య శ్లోక - పఠన లేదు
అమరకాండత్రయం - బరసి చూడగలేదు
శాస్త్రీయ గ్రంధముల్ - చదువలేదు
నీ కటాక్షంబున - నే రచించెద గాని
ప్రఙ్ఞ నాయది గాదు - ప్రస్తుతింప
తే. దప్పుగలిగిన సద్భక్తి - తక్కువౌనె
చెఱకునకు వంకపోయిన - చెడునె తీపు?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
003
సీ. నరసింహ | నీ దివ్య - నామమంత్రముచేత
దురితజాలము లన్ని - దోలవచ్చు
నరసింహ | నీ దివ్య - నామమంత్రముచేత
బలువైన రోగముల్ - పాపవచ్చు
నరసింహ | నీ దివ్య - నామమంత్రముచేత
రిపుసంఘముల సంహ - రింపవచ్చు
నరసింహ | నీ దివ్య - నామమంత్రముచేత
దండహస్తుని బంట్ల - దరమవచ్చు
తే. భళిర | నే నీ మహామంత్ర - బలముచేత
దివ్య వైకుంఠ పదవి సా - ధింపవచ్చు
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
004
సీ. ఆదినారాయణా | - యనుచు నాలుకతోడ
బలుక నేర్చినవారి - పాదములకు
సాష్టాంగముగ నమ - స్కార మర్పణ జేసి
ప్రస్తుతించెదనయ్య - బహువిధముల
ధరణిలో నరులెంత - దండివారైనను
నిన్ను గాననివారి - నే స్మరింప
మేము శ్రేష్ఠుల మంచు - మిదుకుచుంచెడివారి
చెంత జేరగనోను - శేషశయన
తే. పరమ సాత్వికులైన నీ - భక్తవరుల
దాసులకు దాసుడను జుమీ - ధాత్రిలోన
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
005
సీ. ఐశ్వర్యములకు ని - న్ననుసరింపగలేదు
ద్రవ్య మిమ్మని వెంట - దగులలేదు
కనక మిమ్మని చాల - గష్టపెట్టగలేదు
పల్ల కిమ్మని నోట - బలకలేదు
సొమ్ము లిమ్మని నిన్ను - నమ్మి కొల్వగలేదు
భూము లిమ్మని పేరు - పొగడలేదు
బలము లిమ్మని నిన్ను - బ్రతిమాలగాలేదు
పసుల నిమ్మని పట్టు - పట్టలేదు
తే. నేను గోరిన దొక్కటే - నీలవర్ణ
చయ్యనను మోక్షమిచ్చిన - జాలు నాకు
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
006
సీ. మందుండనని నన్ను - నింద చేసిననేమి?
నా దీనతను జూచి - నవ్వ నేమి?
దూరభావములేక - తూలనాడిన నేమి?
ప్రీతిసేయక వంక - బెట్ట నేమి?
కక్కసంబులు పల్కి - వెక్కిరించిన నేమి?
తీవ్రకోపముచేత - దిట్ట నేమి?
హెచ్చుమాటలచేత - నెమ్మె లాడిన నేమి?
చేరి దాపట గేలి - చేయనేమి?
తే. కల్పవృక్షంబువలె నీవు - గల్గ నింక
బ్రజల లక్ష్యంబు నాకేల? - పద్మనాభ |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
007
సీ. చిత్తశుద్ధిగ నీకు - సేవజేసెదగాని
పుడమిలో జనుల మె - ప్పులకు గాదు
జన్మపావనతకై - స్మరణజేసెద గాని
సరివారిలో బ్రతి - ష్థలకు గాదు
ముక్తికోసము నేను - మ్రొక్కి వేడెదగాని
దండిభాగ్యము నిమి - త్తంబు గాదు
నిన్ను బొగడగ విద్య - నేర్చితినేకాని
కుక్షినిండెడు కూటి - కొఱకు గాదు
తే. పారమార్థికమునకు నే బాటుపడితి
గీర్తికి నపేక్షపడలేదు - కృష్ణవర్ణ |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
008
సీ. శ్రవణ రంధ్రముల నీ - సత్కథల్ పొగడంగ
లేశ మానందంబు - లేనివాడు
పుణ్యవంతులు నిన్ను - బూజసేయగ జూచి
భావమందుత్సాహ - పడనివాడు
భక్తవర్యులు నీ ప్ర - భావముల్ పొగడంగ
దత్పరత్వములేక - తలగువాడు
తనచిత్తమందు నీ - ధ్యాన మెన్నడు లేక
కాలమంతయు వృధా - గడపువాడు
తే. వసుధలోనెల్ల వ్యర్ధుండు - వాడె యగును
మఱియు జెడుగాక యెప్పుడు - మమతనొంది.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
009
సీ. గౌతమీస్నానాన - గడతేఱుద మటన్న
మొనసి చన్నీళ్లలో - మునుగలేను
తీర్థయాత్రలచే గృ - తార్థు డౌదమటన్న
బడలి నేమంబు లే - నడపలేను
దానధర్మముల స - ద్గతిని జెందుదమన్న
ఘనముగా నాయొద్ద - ధనములేదు
తపమాచరించి సా - ర్ధకము నొందుదమన్న
నిమిషమైన మనస్సు - నిలుపలేను
తే. కష్టములకోర్వ నాచేత - గాదు నిన్ను
స్మరణచేసెద నా యధా - శక్తి కొలది.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
010
సీ. అర్థివాండ్రకు నీక - హాని జేయుట కంటె
దెంపుతో వసనాభి - దినుట మేలు
ఆడుబిడ్డలసొమ్ము - లపహరించుట కంటె
బండ గట్టుక నూత - బడుట మేలు
పరులకాంతల బట్టి - బల్మి గూడుట కంటె
బడబాగ్ని కీలల - బడుట మేలు
బ్రతుకజాలక దొంగ - పనులు చేయుట కంటె
గొంగుతో ముష్టెత్తు - కొనుట మేలు
తే. జలజదళనేత్ర నీ భక్త - జనులతోడి
జగడమాడెడు పనికంటె - జావు మేలు
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
011
సీ. గార్దభంబున కేల - కస్తూరి తిలకంబు?
మర్కటంబున కేల - మలయజంబు?
శార్ధూలమునక కేల - శర్కరాపూపంబు?
సూకరంబున కేల - చూతఫలము?
మార్జాలమున కేల - మల్లెపువ్వులబంతి?
గుడ్లగూబల కేల - కుండలములు?
మహిషాని కేల ని - ర్మలమైన వస్త్రముల్?
బకసంతతికి నేల - పంజరంబు?
తే. ద్రోహచింతన జేసెడి - దుర్జనులకు
మధురమైనట్టి నీనామ - మంత్రమేల?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
012
సీ. పసరంబు వంజైన - బసులకాపరి తప్పు
ప్రజలు దుర్జనులైన - ప్రభుని తప్పు
భార్య గయ్యాళైన - బ్రాణనాధుని తప్పు
తనయుడు దుష్టయిన - తండ్రి తప్పు
సైన్యంబు చెదిరిన - సైన్యనాధుని తప్పు
కూతురు చెడుగైన - మాత తప్పు
అశ్వంబు చెడుగైన - నారోహకుని తప్పు
దంతి దుష్టయిన మా - వంతు తప్పు
తే. ఇట్టి తప్పులెఱుంగక - యిచ్చవచ్చి
నటుల మెలగుదు రిప్పు డీ - యవని జనులు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
013
సీ. కోతికి జలతారు - కుళ్లాయి యేటికి?
విరజాజి పూదండ - విధవ కేల?
ముక్కిడితొత్తుకు - ముత్తెంపు నత్తేల?
నద్ద మేమిటికి జా - త్యంధునకును?
మాచకమ్మకు నేల - మౌక్తికహారముల్?
క్రూరచిత్తునకు స - ద్గోష్ఠు లేల?
ఱంకుబోతుకు నేల - బింకంపు నిష్ఠలు?
వావి యేటికి దుష్ట - వర్తనునకు?
తే. మాట నిలుకడ కుంకరి - మోటు కేల?
చెవిటివానికి సత్కథ - శ్రవణ మేల?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
014
సీ. మాన్యంబులీయ స - మర్ధుడొక్కడు లేడు
మాన్యముల్ చెఱుప స - మర్ధు లంత
యెండిన యూళ్లగో - డెఱిగింప డెవ్వడు
బండిన యూళ్లము - బ్రభువు లంత
యితడు పేద యటంచు - నెఱిగింప డెవ్వండు
కలవారి సిరు లెన్న - గలరు చాల
దనయాలి చేష్టల - తప్పెన్న డెవ్వడు
బెఱకాంత ఱంకెన్న - బెద్ద లంత
తే. యిట్టి దుష్టుల కధికార - మిచ్చినట్టి
ప్రభువు తప్పు లటంచును - బలుకవలెను.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
015
సీ. తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు
వెళ్లిపోయెడినాడు - వెంటరాదు
లక్షాధికారైన - లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు - మ్రింగబోడు
విత్త మార్జనజేసి - విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము - తోడరాదు
పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి
దానధర్మము లేక - దాచి దాచి
తే. తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
016
సీ. లోకమం దెవడైన - లోభిమానవు డున్న
భిక్ష మర్థిమి జేత - బెట్టలేడు
తాను బెట్టకయున్న - తగవు పుట్టదుగాని
యొరులు పెట్టగ జూచి - యోర్వలేడు
దాతదగ్గఱ జేరి - తన ముల్లె చెడినట్లు
జిహ్వతో జాడీలు - చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన - బలు సంతసమునందు
మేలు కల్గిన జాల - మిణుకుచుండు
తే. శ్రీరమానాథ | యిటువంటి - క్రూరునకును
భిక్షుకుల శత్రువని - పేరు పెట్టవచ్చు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
017
సీ. తనువులో బ్రాణముల్ = తరళిపొయ్యెడివేళ
నీ స్వరూపమును ధ్యా - నించునతడు
నిమిషమాత్రములోన - నిన్ను జేరును గాని
యముని చేతికి జిక్కి - శ్రమలబడడు
పరమసంతోషాన - భజన జేసెడివారి
పుణ్య మేమనవచ్చు - భోగిశయన
మోక్షము నీ దాస - ముఖ్యుల కగు గాని
నరక మెక్కడిదయ్య - నళిననేత్ర
తే. కమలనాభ నీ మహిమలు - గానలేని
తుచ్ఛులకు ముక్తిదొరకుట - దుర్లభంబు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
018
సీ. నీలమేఘశ్యామ | - నీవె తండ్రివి మాకు
కమలవాసిని మమ్ము - గన్నతల్లి
నీ భక్తవరులంత - నిజమైన బాంధవుల్
నీ కటాక్షము మా క - నేకధనము
నీ కీర్తనలు మాకు - లోక ప్రపంచంబు
నీ సహాయము మాకు - నిత్యసుఖము
నీ మంత్రమే మాకు - నిష్కళంకపు విద్య
నీ పద ధ్యానంబు - నిత్యజపము
తే. తోయజాతాక్ష నీ పాద - తులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మ - రుద్రవినుత.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
019
సీ. బ్రతికినన్నాళ్లు నీ - భజన తప్పను గాని
మరణకాలమునందు - మఱతునేమొ
యావేళ యమదూత - లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి - పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ - గప్పగా భ్రమచేత
గంప ముద్భవమంది - కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను - నారాయణా యంచు
బిలుతునో శ్రమచేత - బిలువనొ
తే. నాటి కిప్పుడె చేతు నీ - నామభజన
తలచెదను, జెవి నిడవయ్య | - ధైర్యముగను.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
020
సీ. పాంచభౌతికము దు - ర్బలమైన కాయం బి
దెప్పుడో విడుచుట - యెఱుకలేదు
శతవర్షములదాక - మితము జెప్పిరి గాని
నమ్మరా దామాట - నెమ్మనమున
బాల్యమందో మంచి - ప్రాయమందో లేక
ముదిమియందో లేక - ముసలియందొ
యూరనో యడవినో - యుదకమధ్యముననో
యెప్పుడో విడుచుట - యేక్షణంబొ
తే. మరణమే నిశ్చయము బుద్ధి - మంతుడైన
దేహమున్నంతలో మిమ్ము - దెలియవలయు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
021
సీ. తల్లిదండ్రులు భార్య - తనయు లాప్తులు బావ
మఱదు లన్నలు మేన - మామగారు
ఘనముగా బంధువుల్ - గల్గినప్పటికైన
దాను దర్లగ వెంట - దగిలి రారు
యముని దూతలు ప్రాణ - మపగరించుక పోగ
మమతతో బోరాడి - మాన్పలేరు
బలగ మందఱు దుఃఖ - పడుట మాత్రమె కాని
యించుక యాయుష్య - మియ్యలేరు
తే. చుట్టములమీది భ్రమదీసి - చూర జెక్కి
సంతతము మిమ్ము నమ్ముట - సార్థకంబు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
022
సీ. ఇభరాజవరద | ని - న్నెంత బిల్చినగాని
మాఱు పల్క వదేమి - మౌనితనమొ?
మునిజనార్చిత | నిన్ను - మ్రొక్కి వేడినగాని
కనుల జూడ వదేమి - గడుసుదనమొ?
చాల దైన్యమునొంది - చాటు చొచ్చినగాని
భాగ్య మియ్య వదేమి - ప్రౌఢతనమొ?
స్థిరముగా నీపాద - సేవ జేసెద నన్న
దొరకజాల వదేమి - ధూర్తతనమొ?
తే. మోక్షదాయక | యిటువంటి - మూర్ఖజనుని
కష్టపెట్టిన నీకేమి - కడుపునిండు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
023
సీ. నీమీద కీర్తనల్ - నిత్యగానము జేసి
రమ్యమొందింప నా - రదుడగాను
సావధానముగ నీ - చరణ పంకజ సేవ
సలిపి మెప్పంపంగ - శబరిగాను
బాల్యమప్పటినుండి - భక్తి నీయందున
గలుగను బ్రహ్లాద - ఘనుడగాను
ఘనముగా నీమీది - గ్రంథముల్ గల్పించి
వినుతిసేయను వ్యాస - మునినిగాను
తే. సాధుడను మూర్ఖమతి మను - ష్యాధముడను
హీనుడను జుమ్మి నీవు - న న్నేలుకొనుము.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
024
సీ. అతిశయంబుగ గల్ల - లాడనేర్చితిగాని
పాటిగా సత్యముల్ - పలుకనేర
సత్కార్య విఘ్నముల్ - సలుప నేర్చితిగాని
యిష్ట మొందగ నిర్వ - హింపనేర
నొకరి సొమ్ముకు దోసి - లొగ్గ నేర్చితిగాని
చెలువుగా ధర్మంబు - సేయనేర
ధనము లియ్యంగ వ - ద్దనగ నేర్చితిగాని
శీఘ్ర మిచ్చెడునట్లు - చెప్పనేర
తే. బంకజాతాక్ష | నే నతి - పాతకుడను
దప్పులన్నియు క్షమియింప - దండ్రి వీవె |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
025
సీ. ఉర్విలో నాయుష్య - మున్న పర్యంతంబు
మాయ సంసారంబు - మరగి నరుడు
సకల పాపములైన - సంగ్రహించును గాని
నిన్ను జేరెడి యుక్తి - నేర్వలేడు
తుదకు గాలునియొద్ది - దూత లిద్దఱు వచ్చి
గుంజుక చని వారు - గ్రుద్దుచుండ
హింస కోర్వగ లేక - యేడ్చి గంతులువేసి
దిక్కు లేదని నాల్గు - దిశలు చూడ
తే. దన్ను విడిపింప వచ్చెడి - ధన్యు డేడి
ముందు నీదాసుడై యున్న - ముక్తి గలుగు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
026
సీ. అధిక విద్యావంతు - లప్రయోజకులైరి
పూర్ణశుంఠలు సభా - పూజ్యులైరి
సత్యవంతులమాట - జన విరోధంబాయె
వదరుబోతులమాట - వాసికెక్కె
ధర్మవాదనపరుల్ - దారిద్ర్యమొందిరి
పరమలోభులు ధన - ప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ - భూత పీడితులైరి
దుష్టమానవులు వ - ర్ధిష్ణులైరి
తే. పక్షివాహన | మావంటి - భిక్షుకులకు
శక్తిలేదాయె నిక నీవె - చాటు మాకు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
027
సీ. భుజబలంబున బెద్ద - పులుల జంపగవచ్చు
పాముకంఠము జేత - బట్టవచ్చు
బ్రహ్మ రాక్షసకోట్ల - బాఱద్రోలగవచ్చు
మనుజుల రోగముల్ - మాన్పవచ్చు
జిహ్వ కిష్టముగాని - చేదు మ్రింగగవచ్చు
బదను ఖడ్గము చేత - నదమవచ్చు
గష్టమొందుచు ముండ్ల - కంపలో జొరవచ్చు
దిట్టుబోతుల నోళ్లు - కట్టవచ్చు
తే. బుడమిలో దుష్టులకు ఙ్ఞాన - బోధ తెలిపి
సజ్జనుల జేయలే డెంత - చతురుదైన.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
028
సీ. అవనిలోగల యాత్ర - లన్ని చేయగవచ్చు
ముఖ్యుడై నదులందు - మునుగవచ్చు
ముక్కుపట్టుక సంధ్య - మొనసి వార్వగవచ్చు
దిన్నగా జపమాల - ద్రిప్పవచ్చు
వేదాల కర్థంబు - విఱిచి చెప్పగవచ్చు
శ్రేష్ఠ్ క్రతువు లెల్ల - జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు - దానమియ్యగవచ్చు
నైష్ఠికాచారముల్ - నడుపవచ్చు
తే. జిత్త మన్యస్థలంబున - జేరకుండ
నీ పదాంభోజములయందు - నిలపరాదు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
029
సీ. కర్ణయుగ్మమున నీ - కథలు సోకినజాలు
పెద్ద పోగుల జోళ్లు - పెట్టినట్లు
చేతు లెత్తుచు బూజ - సేయగల్గినజాలు
తోరంపు కడియాలు - దొడిగినట్లు
మొనసి మస్తకముతో - మ్రొక్క గల్గినజాలు
చెలువమైన తురాయి - చెక్కినట్లు
గళము నొవ్వగ నిన్ను - బలుక గల్గినజాలు
వింతగా గంఠీలు - వేసినట్లు
తే. పూని నిను గొల్చుటే సర్వ - భూషణంబు
లితర భూషణముల నిచ్చ - గింపనేల.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
030
సీ. భువనరక్షక | నిన్ను - బొగడనేరని నోరు
వ్రజ కగోచరమైన - పాడుబొంద
సురవరార్చిత | నిన్ను - జూడగోరని కనుల్
జలములోపల నెల్లి - సరపుగుండ్లు
శ్రీరమాధిమ | నీకు - సేవజేయని మేను
కూలి కమ్ముడువోని - కొలిమితిత్తి
వేడ్కతో నీకథల్ - వినని కర్ణములైన
గఠినశిలాదుల - గలుగు తొలలు
తే. పద్మలోచన నీమీద - భక్తిలేని
మానవుడు రెండుపాదాల - మహిషమయ్య.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
031
సీ. అతివిద్యనేర్చుట - అన్నవస్త్రములకే
పసుల నార్జించుట - పాలకొఱకె
సతిని బెండ్లాడుట - సంసార సుఖముకే
సుతుల బోషించుట - గతులకొఱకె
సైన్యముల్ గూర్చుట - శత్రుజయమునకే
సాము నేర్చుటలెల్ల - చావుకొఱకె
దానమిచ్చుటయు ముం - దటి సంచితమునకే
ఘనముగా జదువుట - కడుపు కొఱకె
తే. యితర కామంబు గోరక - సతతముగను
భక్తి నీయందు నిలుపుట - ముక్తి కొఱకె
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
032
సీ. ధరణిలో వేయేండ్లు - తనువు నిల్వగబోదు
ధన మెప్పటికి శాశ్వ - తంబు గాదు
దారసుతాదులు - తనవెంట రాలేరు
భ్రుత్యులు మృతిని ద - ప్పింపలేరు
బంధుజాలము తన్ను - బ్రతికించుకోలేరు
బలపరాక్రమ మేమి - పనికి రాదు
ఘనమైన సకల భా - గ్యం బెంత గల్గిన
గోచిమాత్రంబైన - గొనుచుబోడు
తే. వెఱ్ఱి కుక్కల భ్రమలన్ని - విడిచి నిన్ను
భజన జేసెడివారికి - బరమసుఖము.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
033
సీ. నరసింహ | నాకు దు - ర్ణయములే మెండాయె
సుగుణ మొక్కటిలేదు - చూడ జనిన
నన్యకాంతల మీద - నాశ మానగలేను
నొరుల క్షేమము చూచి - యోర్వలేను
ఇటువంటి దుర్బుద్ధు - లిన్ని నా కున్నవి
నేను జేసెడివన్ని - నీచకృతులు
నావంటి పాపిష్ఠి - నరుని భూలోకాన
బుట్టజేసితి వేల - భోగిశయన |
తే. అబ్జదళనేత్ర | నాతండ్రి - వైన ఫలము
నేరములు గాచి రక్షింపు - నీవె దిక్కు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
034
సీ. ధీరత బరుల నిం - దింప నేర్చితి గాని
తిన్నగా నిను బ్రస్తు - తింపనైతి
బొరుగు కామినులందు - బుద్ధి నిల్పితి గాని
నిన్ను సంతతము ధ్యా - నింపనైతి
బెరికిముచ్చట లైన - మురిసి వింటినిగాని
యెంచి నీకథ లాల - కించనైతి
గౌతుకంబున బాత - కము గడించితిగాని
హెచ్చు పుణ్యము సంగ్ర - హింపనైతి
తే. నవనిలో నేను జన్మించి - నందు కేమి
సార్థకము గానరాదాయె - స్వల్పమైన.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
035
సీ. అంత్యకాలమునందు - నాయాసమున నిన్ను
దలతునో తలపనో - తలతు నిపుడె
నరసింహ | నరసింహ | - నరసింహ | లక్ష్మీశ |
దానవాంతక | కోటి - భానుతేజ |
గోవింద | గోవింద | - గోవింద | సర్వేశ |
పన్నగాధిపశాయి | - పద్మనాభ |
మధువైరి | మధువైరి | - మధువైరి | లోకేశ |
నీలమేఘశరీర | నిగమవినుత |
తే. ఈ విధంబున నీనామ - మిష్టముగను
భజనసేయుచు నుందు నా - భావమందు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
036
సీ. ఆయురారోగ్య పు - త్రార్థ సంపదలన్ని
కలుగజేసెడి భార - కర్త వీవె
చదువు లెస్సగ నేర్పి - సభలో గరిష్ఠాధి
కార మొందించెడి - ఘనుడ వీవె
నడక మంచిది పెట్టి - నరులు మెచ్చేడునట్టి
పేరు రప్పించెడి - పెద్ద వీవె
బలువైన వైరాగ్య - భక్తిఙ్ఞానములిచ్చి
ముక్తి బొందించెడు - మూర్తి వీవె
తే. అవనిలో మానవుల కన్ని - యాసలిచ్చి
వ్యర్థులను జేసి తెలిపెడి - వాడ వీవె.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
037
సీ. కాయ మెంత భయాన - గాపాడిననుగాని
ధాత్రిలో నది చూడ - దక్క బోదు
ఏవేళ నేరోగ - మేమరించునొ? సత్త్వ
మొందంగ జేయు నే - చందమునను
ఔషధంబులు మంచి - వనుభవించిన గాని
కర్మ క్షీణంబైన గాని - విడదు;
కోటివైద్యులు గుంపు - గూడివచ్చిన గాని
మరణ మయ్యెడు వ్యాధి - మాన్పలేరు
తే. జీవుని ప్రయాణకాలంబు - సిద్ధమైన
నిలుచునా దేహ మిందొక్క - నిమిషమైన?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
038
సీ. జందె మింపుగ వేసి - సంధ్య వార్చిన నేమి
బ్రహ్మ మందక కాడు - బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీచూర్ణ - గురురేఖ లిడినను
విష్ణు నొందక కాడు - వైష్ణవుండు
బూదిని నుదుటను - బూసికొనిన నేమి
శంభు నొందక కాడు - శైవజనుడు
కాషాయ వస్త్రాలు - గట్టి కప్పిన నేమి
యాశ పోవక కాడు - యతివరుండు
తే. ఎన్ని లౌకికవేషాలు - గట్టుకొనిన
గురుని జెందక సన్ముక్తి - దొరకబోదు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
039
సీ. నరసింహ | నే నిన్ను - నమ్మినందుకు జాల
నెనరు నాయందుంచు - నెమ్మనమున
నన్ని వస్తువులు ని - న్నడిగి వేసటపుట్టె
నింకనైన గటాక్ష - మియ్యవయ్య
సంతసంబున నన్ను - స్వర్గమందే యుంచు
భూమియందే యుంచు - భోగశయన |
నయముగా వైకుంఠ - నగరమందే యుంచు
నరకమందే యుంచు - నళిననాభ |
తే. ఎచట నన్నుంచిననుగాని - యెపుడు నిన్ను
మఱచి పోకుండ నీనామ - స్మరణనొసగు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
040
సీ. దేహ మున్నవఱకు - మోహసాగరమందు
మునుగుచుందురు శుద్ధ - మూఢజనులు
సలలితైశ్వర్యముల్ - శాశ్వతం బనుకొని
షడ్భ్రమలను మాన - జాల రెవరు
సర్వకాలము మాయ - సంసార బద్ధులై
గురుని కారుణ్యంబు గోరుకొనరు
ఙ్ఞాన భక్తి విరక్తు - లైన పెద్దల జూచి
నింద జేయక - తాము నిలువలేరు
తే. మత్తులైనట్టి దుర్జాతి - మనుజులెల్ల
నిన్ను గనలేరు మొదటికే - నీరజాక్ష.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
041
సీ. ఇలలోన నే జన్మ - మెత్తినప్పటినుండి
బహు గడించితినయ్య - పాతకములు
తెలిసి చేసితి గొన్ని - తెలియజాలక చేసి
బాధ నొందితి నయ్య - పద్మనాభ
అనుభవించెడు నప్పు - దతి ప్రయాసంబంచు
బ్రజలు చెప్పగ జాల - భయము గలిగె
నెగిరి పోవుటకునై - యే యుపాయంబైన
జేసి చూతమటన్న - జేతగాదు
తే. సూర్యశశినేత్ర | నీచాటు - జొచ్చి నాను
కలుషములు ద్రుంచి నన్నేలు - కష్టమనక.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
042
సీ. తాపసార్చిత | నేను - పాపకర్ముడనంచు
నాకు వంకలబెట్ట - బోకుచుమ్మి
నాటికి శిక్షలు - నన్ను చేయుటకంటె
నేడు సేయుము నీవు - నేస్తమనక
అతిభయంకరులైన - యమదూతలకు నన్ను
నొప్పగింపకు మయ్య - యురగశయన |
నీ దాసులను బట్టి - నీవు దండింపంగ
వద్దు వద్దన రెంత - పెద్దలైన
తే. దండ్రివై నీవు పరపీడ - దగులజేయ
వాసిగల పేరు కపకీర్తి - వచ్చునయ్య.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
043
సీ. ధరణిలోపల నేను - తల్లిగర్భమునందు
బుట్టినప్పటినుండి - పుణ్యమెఱుగ
నేకాదశీవ్రతం - బెన్న డుండుగ లేదు
తీర్థయాత్రలకైన - దిరుగలేదు
పారమార్థికమైన - పనులు చేయగలేదు
భిక్ష మొక్కనికైన - బెట్టలేదు
ఙ్ఞానవంతులకైన - బూని మ్రొక్కగలేదు
ఇతర దానములైన - నియ్యలేదు
తే. నళినదళనేత్ర | నిన్ను నే - నమ్మినాను
జేరి రక్షింపవే నన్ను - శీఘ్రముగను.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
044
సీ. అడవిపక్షుల కెవ్వ - డాహార మిచ్చెను
మృగజాతి కెవ్వడు - మేతబెట్టె
వనచరాదులకు భో - జన మెవ్వ డిప్పించె
జెట్ల కెవ్వడు నీళ్ళు - చేదిపోసె
స్త్రీలగర్భంబున - శిశువు నెవ్వడు పెంచె
ఫణుల కెవ్వడు పోసె - బరగ బాలు
మధుపాళి కెవ్వడు - మకరంద మొనరించె
బసుల మెవ్వ డొసంగె - బచ్చిపూరి
తే. జీవకోట్లను బోషింప - నీవెకాని
వేఱె యొక దాత లేడయ్య - వెదకిచూడ.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
045
సీ. దనుజారి | నావంటి - దాసజాలము నీకు
కోటి సంఖ్య గలారు - కొదువ లేదు
బంట్లసందడివల్ల - బహుపరాకై నన్ను
మఱచి పోకుము భాగ్య - మహిమచేత
దండిగా భ్రుత్యులు - దగిలి నీకుండంగ
బక్కబం టేపాటి - పనికి నగును?
నీవు మెచ్చెడి పనుల్ - నేను జేయగలేక
యింత వృథాజన్మ - మెత్తినాను
తే. భూజనులలోన నే నప్ర - యోజకుడను
గనుక నీ సత్కటాక్షంబు - గలుగజేయు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
046
సీ. కమలలోచన | నన్ను - గన్నతండ్రివిగాన
నిన్ను నేమఱకుంటి - నేను విడక
యుదరపోషణకునై - యొకరి నే నాశింప
నేర నా కన్నంబు - నీవు నడపు
పెట్టలే నంటివా - పిన్న పెద్దలలోన
దగవు కిప్పుడు దీయ - దలచినాను
ధనము భారంబైన - దలకిరీటము నమ్ము
కుండలంబులు పైడి - గొలుసు లమ్ము
తే. కొసకు నీ శంఖ చక్రముల్ - కుదువబెట్టి
గ్రాసము నొసంగి పోషించు - కపటముడిగి.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
047
సీ. కువలయశ్యామ | నీ - కొలువు చేసిన నాకు
జీత మెందుకు ముట్ట - జెప్పవైతి
మంచిమాటలచేత - గొంచెమియ్యగలేవు
కలహమౌ నిక జుమ్మి - ఖండితముగ
నీవు సాధువు గాన - నింత పర్యంతంబు
చనవుచే నిన్నాళ్లు - జరుపవలసె
నిక నే సహింప నీ - విపుడు నన్నేమైన
శిక్ష చేసిన జేయు - సిద్ధమయితి
తే. నేడు కరుణింపకుంటివా - నిశ్చయముగ
దెగబడితి చూడు నీతోడ - జగడమునకు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
048
సీ. హరి | నీకు బర్యంక - మైన శేషుడు చాల
బవనము భక్షించి - బ్రతుకుచుండు
ననువుగా నీకు వా - హనమైన ఖగరాజు
గొప్పపామును నోట - గొఱుకుచుండు
అదిగాక నీ భార్య - యైన లక్ష్మీదేవి
దినము పేరంటంబు - దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి - నిత్యపూజలు చేసి
ప్రేమ బక్వాన్నముల్ - పెట్టుచుండ్రు
తే. స్వస్థముగ నీకు గ్రాసము - జరుగుచుండు
గాసు నీ చేతి దొకటైన - గాదు వ్యయము.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
049
సీ. పుండరీకాక్ష | నా - రెండు కన్నుల నిండ
నిన్ను జూచెడి భాగ్య - మెన్నడయ్య
వాసిగా నా మనో - వాంఛ దీరెడునట్లు
సొగసుగా నీరూపు - చూపవయ్య
పాపకర్ముని కంట - బడకపోవుదమంచు
బరుషమైన ప్రతిఙ్ఞ - బట్టినావె?
వసుధలో బతిత పా - వనుడ వీ వంచు నే
బుణ్యవంతులనోట - బొగడ వింటి
తే. నేమిటికి విస్తరించె నీ - కింత కీర్తి
ద్రోహినైనను నా కీవు - దొరకరాదె?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
050
సీ. పచ్చి చర్మపు దిత్తి - పసలేదు దేహంబు
లోపల నంతట - రోయ రోత
నరములు శల్యముల్ - నవరంధ్రములు రక్త
మాంసంబు కండలు - మైల తిత్తి
బలువైన యెండ వా - నల కోర్వ దింతైన
దాళలే దాకలి - దాహములకు
సకల రోగములకు - సంస్థానమె యుండు
నిలువ దస్థిరమైన - నీటిబుగ్గ
తే. బొందిలో నుండు ప్రాణముల్ - పోయినంత
గాటికే గాని కొఱగాదు - గవ్వకైన.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
051
సీ. పలురోగములకు నీ - పాదతీరమె కాని
వలపు మందులు నాకు - వలదు వలదు
చెలిమి సేయుచు నీకు - సేవ జేసెద గాన
నీ దాసకోటిలో - నిలుపవయ్య
గ్రహభయంబునకు జ - క్రము దలచెదగాని
ఘోరరక్షలు గట్ట - గోరనయ్య
పాముకాటుకు నిన్ను - భజన జేసెదగాని
దాని మంత్రము నేను - తలపనయ్య
తే. దొరికితివి నాకు దండి వై - ద్యుడవు నీవు
వేయికష్టాలు వచ్చినన్ - వెఱవనయ్య.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
052
సీ. కూటికోసరము నే - గొఱగాని జనులచే
బలుగద్దరింపులు - పడగవలసె?
దార సుత భ్రమ - దగిలియుండగగదా
దేశదేశములెల్ల - దిరుగవలసె?
బెను దరిద్రత పైని - బెనగియుండగగదా
చేరి నీచులసేవ - చేయవలసె?
నభిమానములు మది - నంటియుండగగదా
పరుల జూచిన భీతి - పడగవలసె?
తే. నిటుల సంసారవారిధి - నీదలేక
వేయివిధముల నిన్ను నే - వేడుకొంటి.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
053
సీ. సాధు సజ్జనులతో - జగడమాడిన గీడు
కవులతో వైరంబు - గాంచ గీడు
పరమ దీనుల జిక్క - బట్టి కొట్టిన గీడు
భిక్షగాండ్రను దుఃఖ - పెట్ట గీడు
నిరుపేదలను జూచి - నిందజేసిన గీడు
పుణ్యవంతుల దిట్ట - బొసగు గీడు
సద్భక్తులను దిర - స్కారమాడిన గీడు
గురుని ద్రవ్యము దోచు - కొనిన గీడు
తే. దుష్టకార్యము లొనరించు - దుర్జనులకు
ఘనతరంబైన నరకంబు - గట్టిముల్లె.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
054
సీ. పరులద్రవ్యముమీద - భ్రాంతి నొందినవాడు
పరకాంతల నపేక్ష - పడెడువాడు
అర్థుల విత్తంబు - లపహరించెడువాడు
దానమియ్యంగ వ - ద్దనెడివాడు
సభలలోపల నిల్చి - చాడిచెప్పెడివాడు
పక్షపు సాక్ష్యంబు - పలుకువాడు
విష్ణుదాసుల జూచి - వెక్కిరించెడివాడు
ధర్మసాధుల దిట్ట - దలచువాడు
తే. ప్రజల జంతుల హింసించు - పాతకుండు
కాలకింకర గదలచే - గష్టమొందు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
055
సీ. నరసింహ | నా తండ్రి - నన్నేలు నన్నేలు
కామితార్థము లిచ్చి - కావు కావు
దైత్యసంహార | చాల - దయయుంచు దయయుంచు
దీనపోషక | నీవె - దిక్కు దిక్కు
రత్నభూషితవక్ష | - రక్షించు రక్షించు
భువనరక్షక | నన్ను - బ్రోవు బ్రోవు
మారకోటిసురూప | - మన్నించు మన్నించు
పద్మలోచన | చేయి - పట్టు పట్టు
తే. సురవినుత | నేను నీచాటు - జొచ్చినాను
నా మొఱాలించి కడతేర్చు - నాగశయన |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
056
సీ. నీ భక్తులను గనుల్ - నిండ జూచియు రెండు
చేతుల జోహారు - సేయువాడు
నేర్పుతో నెవరైన - నీ కథల్ చెప్పంగ
వినయమందుచు జాల - వినెడువాడు
తన గృహంబునకు నీ - దాసులు రా జూచి
పీటపై గూర్చుండ - బెట్టువాడు
నీసేవకుల జాతి - నీతు లెన్నక చాల
దాసోహ మని చేర - దలచువాడు
తే. పరమభక్తుండు ధన్యుండు - భానుతేజ |
వాని గనుగొన్న బుణ్యంబు - వసుధలోన.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
057
సీ. పక్షివాహన | నేను - బ్రతికినన్నిదినాలు
కొండెగాండ్రను గూడి - కుమతినైతి
నన్నవస్త్రము లిచ్చి - యాదరింపుము నన్ను
గన్నతండ్రివి నీవె - కమలనాభ |
మరణ మయ్యెడినాడు - మమతతో నీయొద్ది
బంట్ల దోలుము ముందు - బ్రహ్మజనక |
ఇనజభటావళి - యీడిచికొనిపోక
కరుణతో నాయొద్ద - గావ లుంచు
తే. కొసకు నీ సన్నిధికి బిల్చు - కొనియు నీకు
సేవకుని జేసికొనవయ్య - శేషశయన |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
058
సీ. నిగమాదిశాస్త్రముల్ - నేర్చిన ద్విజుడైన
యఙ్ఞకర్తగు సోమ - యాజియైన
ధరణిలోపల బ్రభా - త స్నానపరుడైన
నిత్యసత్కర్మాది - నిరతుడైన
నుపవాస నియమంబు - లొందు సజ్జనుడైన
గావివస్త్రముగట్టు - ఘనుడునైన
దండిషోడశమహా - దానపరుండైన
సకల యాత్రలు సల్పు - సరసుడైన
తే. గర్వమున గష్టపడి నిన్ను - గానకున్న
మోక్షసామ్రాజ్య మొందడు - మోహనాంగ |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
059
సీ. పంజరంబున గాకి - బట్టి యుంచిన లెస్స
పలుకునే వింతైన - చిలుకవలెను?
గార్దభంబును దెచ్చి - కళ్లెమింపుగవేయ
దిరుగునే గుఱ్ఱంబు - తీరుగాను?
ఎనుపపోతును మావ - టీ డు శిక్షించిన
నడచునే మదవార - ణంబువలెను?
పెద్దపిట్టను మేత - బెట్టి పెంచిన గ్రొవ్వి
సాగునే వేటాడు - డేగవలెను?
తే. కుజనులను దెచ్చి నీ సేవ - కొఱకు బెట్ట
వాంఛతో జేతురే భక్త - వరులవలెను?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
060
సీ. నీకు దాసుడ నంటి - నిన్ను నమ్ముకయుంటి
గాన నాపై నేడు - కరుణజూడు
దోసిలొగ్గితి నీకు - ద్రోహ మెన్నగబోకు
పద్మలోచన | నేను - పరుడగాను
భక్తి నీపై నుంచి - భజన జేసెద గాని
పరుల వేడను జుమ్మి - వరము లిమ్ము
దండిదాతవు నీవు - తడవుసేయక కావు
ఘోరపాతకరాశి - గొట్టివైచి
తే. శీఘ్రముగ గోర్కు లీడేర్చు - చింత దీర్చు
నిరతముగ నన్ను బోషించు - నెనరు నుంచు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
061
సీ. విద్య నేర్చితి నంచు - విఱ్ఱవీగగలేదు
భాగ్యవంతుడ నంచు - బలుకలేదు
ద్రవ్యవంతుడ నంచు - దఱచు నిక్కగలేదు
నిరతదానములైన - నెఱపలేదు
పుత్రవంతుడ నంచు - బొగడుచుండగలేదు
భ్రుత్యవంతుడ నంచు - బొగడలేదు
శౌర్యవంతుడ నంచు - సంతసింపగలేదు
కార్యవంతుడ నంచు - గడపలేదు
తే. నలుగురికి మెప్పుగానైన - నడువలేదు
నళినదళనేత్ర | నిన్ను నే - నమ్మినాను.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
062
సీ. అతిలోభులను భిక్ష - మడుగబోవుట రోత
తనద్రవ్య మొకరింట - దాచ రోత
గుణహీను డగువాని - కొలువు గొల్చుట రోత
యొరుల పంచలక్రింద - నుండ రోత
భాగ్యవంతునితోడ - బంతమాడుట రోత
గుఱిలేని బంధుల - గూడ రోత
ఆదాయములు లేక - యప్పుదీయుట రోత
జార చోరుల గూడి - చనుట రోత
తే. యాదిలక్ష్మీశ | నీబంట - నైతినయ్య |
యింక నెడబాసి జన్మంబు - లెత్త రోత.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
063
సీ. వెఱ్ఱివానికి నేల - వేదాక్షరంబులు?
మోటువానికి మంచి - పాట లేల?
పసులకాపరి కేల - పరతత్త్వబోధలు?
విటకాని కేటికో - విష్ణుకథలు?
వదరు శుంఠల కేల - వ్రాత పుస్తకములు?
తిరుగు ద్రిమ్మరి కేల - దేవపూజ?
ద్రవ్యలోభికి నేల - ధాతృత్వ గుణములు?
దొంగబంటుకు మంచి - సంగ తేల?
తే. క్రూరజనులకు నీమీద - గోరి కేల?
ద్రోహి పాపాత్మునకు దయా - దుఃఖ మేల?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
064
సీ. నా తండ్రి నాదాత - నాయిష్టదైవమా
నన్ను మన్ననసేయు - నారసింహ |
దయయుంచు నామీద - దప్పులన్ని క్షమించు
నిగమగోచర | నాకు - నీవె దిక్కు
నే దురాత్ముడ నంచు - నీమనంబున గోప
గింపబోకుము స్వామి | - కేవలముగ
ముక్తిదాయక నీకు - మ్రొక్కినందుకు నన్ను
గరుణించి రక్షించు - కమలనాభ |
తే. దండిదొర వంచు నీవెంట - దగిలినాను
నేడు ప్రత్యక్షమై నన్ను - నిర్వహింపు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
065
సీ. వేమాఱు నీకథల్ - వినుచు నుండెడివాడు
పరుల ముచ్చటమీద - భ్రాంతి పడడు
అగణితంబుగ నిన్ను - బొగడ నేర్చినవాడు
చెడ్డమాటలు నోట - జెప్పబోడు
ఆసక్తిచేత ని - న్ననుసరించెడివాడు
ధనమదాంధులవెంట - దగుల బోడు
సంతసంబున నిన్ను - స్మరణజేసెడివాడు
చెలగి నీచులపేరు - దలపబోడు
తే. నిన్ను నమ్మిన భక్తుండు - నిశ్చయముగ
గోరి చిల్లర వేల్పుల - గొల్వబోడు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
066
సీ. నే నెంత వేడిన - నీ కేల దయరాదు?
పలుమాఱు పిలిచిన - బలుక వేమి?
పలికిన నీ కున్న - పద వేమిబోవు? నీ
మోమైన బొడచూప - వేమి నాకు?
శరణు జొచ్చినవాని - సవరింపవలె గాక
పరిహరించుట నీకు - బిరుదు గాదు
నీదాసులను నీవు - నిర్వహింపక యున్న
బరు లెవ్వ రగుదురు - పంకజాక్ష |
తే. దాత దైవంబు తల్లియు - దండ్రి వీవె
నమ్మియున్నాను నీపాద - నళినములను.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
067
సీ. వేదముల్ చదివెడు - విప్రవర్యుండైన
రణము సాధించెడు - రాజెయైన
వర్తకకృషికుడౌ - వైశ్యముఖ్యుండైన
బరిచగించెడు శూద్ర - వర్యుడయిన
మెచ్చుఖడ్గము బట్టి - మెఱయు మ్లేచ్ఛుండైన
బ్రజల కక్కఱపడు - రజకుడైన
చర్మ మమ్మెడి హీన - చండాలనరుడైన
నీ మహీతలమందు - నెవ్వడైన
తే. నిన్ను గొనియాడుచుండెనా - నిశ్చయముగ
వాడు మోక్షాధికారి యీ - వసుధలోన.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
068
సీ. సకలవిద్యలు నేర్చి - సభ జయింపగవచ్చు
శూరుడై రణమందు - బోరవచ్చు
రాజరాజై పుట్టి - రాజ్య మేలగవచ్చు
హేమ గోదానంబు - లియ్యవచ్చు
గగనమం దున్న చు - క్కల నెంచగావచ్చు
జీవరాసుల పేళ్లు - చెప్పవచ్చు
నష్టాంగయోగము - లభ్యసింపగవచ్చు
మేక రీతిగ నాకు - మెసవవచ్చు
తే. తామరసగర్భ హర పురం - దరులకైన
నిన్ను వర్ణింప దరమౌనె - నీరజాక్ష |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
069
సీ. నరసింహ | నీవంటి - దొరను సంపాదించి
కుమతి మానవుల నే - గొల్వజాల
నెక్కు వైశ్వర్యంబు - లియ్యలేకున్నను
బొట్టకుమాత్రము - పోయరాదె?
ఘనముగా దిది నీకు - కరవున బోషింప
గష్ట మెంతటి స్వల్ప - కార్యమయ్య?
పెట్టజాలక యేల - భిక్షమెత్తించెదు
నన్ను బీదను జేసి - నా వదేమి?
తే. అమల | కమలాక్ష | నే నిట్లు - శ్రమపడంగ
గన్నులకు బండువై నీకు - గానబడునె?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
070
సీ. వనరుహనాభ | నీ - వంక జేరితి నేను
గట్టిగా నను గావు - కావు మనుచు
వచ్చినందుకు వేగ - వరము లియ్యకకాని
లేవబోయిన నిన్ను - లేవనియ్య
గూర్చుండబెట్టి నీ - కొంగు గట్టిగ బట్టి
పుచ్చుకొందును జూడు - భోగిశయన |
యీవేళ నీ కడ్డ - మెవరు వచ్చినగాని
వారికైనను లొంగి - వడకబోను
తే. గోపగాడను నీవు నా - గుణము తెలిసి
యిప్పుడే నన్ను రక్షించి - యేలుకొమ్ము.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
071
సీ. ప్రహ్లాదు డేపాటి - పైడి కానుక లిచ్చె?
మదగజం బెన్నిచ్చె - మౌక్తికములు?
నారదుం డెన్నిచ్చె - నగలు రత్నంబు? ల
హల్య నీ కే యగ్ర - హార మిచ్చె?
ఉడుత నీ కేపాటి - యూడిగంబులు చేసె?
ఘనవిభీషణు డేమి - కట్న మిచ్చె?
పంచపాండవు లేమి - లంచ మిచ్చిరి నీకు?
ద్రౌపది నీ కెంత - ద్రవ్య మిచ్చె?
తే. నీకు వీరంద ఱయినట్లు - నేను గాన?
యెందు కని నన్ను రక్షింప - విందువదన |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
072
సీ. వాంఛతో బలిచక్ర - వర్తిదగ్గర జేరి
భిక్షమెత్తితి వేల - బిడియపడక?
యడవిలో శబరి ది - య్యని ఫలా లందియ్య
జేతులొగ్గితి వేల - సిగ్గుపడక?
వేడ్కతో వేవేగ - విదురునింటికి నేగి
విందుగొంటి వదేమి - వెలితిపడక?
అడుకు లల్పము కుచే - లుడు గడించుక తేర
బొక్కసాగితి వేల - లెక్కగొనక?
తే. భక్తులకు నీవు పెట్టుట - భాగ్యమౌను
వారి కాశించితివి తిండి - వాడ వగుచు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
073
సీ. స్తంభమం దుదయించి - దానవేంద్రుని ద్రుంచి
కరుణతో బ్రహ్లాదు - గాచినావు
మకరిచే జిక్కి సా - మజము దుఃఖించంగ
గృపయుంచి వేగ ర - క్షించినావు
శరణంచు నా విభీ - షణుడు నీ చాటున
వచ్చినప్పుడె లంక - నిచ్చినావు
ఆ కుచేలుడు చేరె - డటుకు లర్పించిన
బహుసంపదల నిచ్చి - పంపినావు
తే. వారివలె నన్ను బోషింప - వశముగాదె?
యంత వలపక్ష మేల శ్రీ - కాంత | నీకు?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
074
సీ. వ్యాసు డే కులమందు - వాసిగా జన్మించె?
విదురు డే కులమందు - వృద్ధి బొందె?
గర్ణు డేకులమందు - ఘనముగా వర్ధిల్లె?
నా వసిష్ఠుం డెందు - నవతరించె?
నింపుగా వాల్మీకి - యే కులంబున బుట్టె?
గుహు డను పుణ్యు డే - కులమువాడు?
శ్రీశుకు డెక్కట - జెలగి జన్మించెను?
శబరి యేకులమందు - జన్మమొందె?
తే. నే కులంబున వీ రింద - ఱెచ్చినారు?
నీకృపాపాత్రులకు జాతి - నీతు లేల?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
075
సీ. వసుధాస్థలంబున - వర్ణహీనుడు గాని
బహుళ దురాచార - పరుడు గాని
తడసి కాసియ్యని - ధర్మశూన్యుడు గాని
చదువనేరని మూఢ - జనుడు గాని
సకలమానవులు మె - చ్చని కృతఘ్నుడు గాని
చూడ సొంపును లేని - శుంఠ గాని
అప్రతిష్ఠలకు లో - నైన దీనుడు గాని
మొదటి కే మెఱుగని - మోటు గాని
తే. ప్రతిదినము నీదు భజనచే - బరగునట్టి
వాని కే వంక లేదయ్య - వచ్చు ముక్తి.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
076
సీ. ఇభకుంభములమీది - కెగిరెడి సింగంబు
ముట్టునే కుఱుచైన - మూషకమును?
నవచూతపత్రముల్ - నమలుచున్న పికంబు
గొఱుకునే జిల్లేడు - కొనలు నోట?
అరవిందమకరంద - మనుభవించెడి తేటి
పోవునే పల్లేరు - పూలకడకు?
లలిత మైన రసాల - ఫలము గోరెడి చిల్క
మెసవునే భమత ను - మ్మెత్తకాయ?
తే. నిలను నీకీర్తనలు పాడ - నేర్చినతడు
పరులకీర్తన బాడునే - యరసి చూడ?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
077
సీ. సర్వేశ | నీపాద - సరసిజద్వయమందు
జిత్త ముంపగలేను - జెదరకుండ
నీవైన దయయుంచి - నిలిచి యుండెడునట్లు
చేరి నన్నిపు డేలు - సేవకుడను
వనజలోచన | నేను - వట్టి మూర్ఖుడ జుమ్మి
నీస్వరూపము జూడ - నేర్పు వేగ
తన కుమారున కుగ్గు - తల్లి వోసినయట్లు
భక్తిమార్గం బను - పాలు పోసి
తే. ప్రేమతో నన్ను బోషించి - పెంచుకొనుము
ఘనత కెక్కించు నీదాస - గణములోన.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
078
సీ. జీమూతవర్ణ | నీ - మోముతో సరిరాక
కమలారి యతికళం - కమును బడసె
సొగసైన నీ నేత్ర - యుగముతో సరిరాక
నళినబృందము నీళ్ల - నడుమ జేరె
గరిరాజవరద | నీ - గళముతో సరిరాక
పెద్దశంఖము బొబ్బ - పెట్ట బొడగె
శ్రీపతి | నీదివ్య - రూపుతో సరి రాక
పుష్పబాణుడు నీకు - బుత్రు డయ్యె
తే. నిందిరాదేవి నిన్ను మో - హించి విడక
నీకు బట్టమహిషి యయ్యె - నిశ్చయముగ.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
079
సీ. హరిదాసులను నింద - లాడకుండిన జాలు
సకల గ్రంథమ్ములు - చదివినట్లు
భిక్ష మియ్యంగ ద - ప్పింపకుండిన జాలు
జేముట్టి దానంబు - చేసినట్లు
మించి సజ్జనుల వం - చించకుండిన జాలు
నింపుగా బహుమాన - మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ - దీయకుండిన జాలు
గనకకంబపు గుళ్లు - గట్టినట్లు
తే. ఒకరి వర్శాశనము ముంచ - కున్న జాలు
బేరుకీర్తిగ సత్రముల్ - పెట్టినట్లు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
080
సీ. ఇహలోకసౌఖ్యము - లిచ్చగించెద మన్న
దేహ మెప్పటికి దా - స్థిరత నొంద
దాయుష్య మున్న ప - ర్యంతంబు పటుతయు
నొక్కతీరున నుండ - దుర్విలోన
బాల్యయువత్వదు - ర్బలవార్ధకము లను
మూటిలో మునిగెడి - ముఱికికొంప
భ్రాంతితో దీని గా - పాడుద మనుమొన్న
గాలమృత్యువుచేత - గోలుపోవు
తే. నమ్మరా దయ్య | యిది మాయ - నాటకంబు
జన్మ మిక నొల్ల న న్నేలు - జలజనాభ |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
081
సీ. వదనంబు నీనామ - భజన గోరుచునుండు
జిహ్వ నీకీర్తనల్ - సేయ గోరు
హస్తయుగ్మంబు ని - న్నర్చింప గోరును
గర్ణముల్ నీ మీది - కథలు గోరు
తనువు నీసేవయే - ఘనముగా గోరును
నయనముల్ నీదర్శ - నంబు గోరు
మూర్ధమ్ము నీపద - మ్ముల మ్రొక్కగా గోరు
నాత్మ నీదై యుండు - నరసి చూడ
తే. స్వప్నమున నైన నేవేళ - సంతతమును
బుద్ధి నీ పాదములయందు - బూనియుండు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
082
సీ. పద్మాక్ష | మమతచే - బరము నందెద మంచు
విఱ్ఱవీగుదుమయ్య - వెఱ్ఱిపట్టి
మాస్వతంత్రంబైన - మదము గండ్లకు గప్పి
మొగము పట్టదు కామ - మోహమునను
బ్రహ్మదేవుండైన - బైడిదేహము గల్గ
జేసివేయక మమ్ము - జెఱిచె నతడు
తుచ్ఛమైనటువంటి - తో లెమ్ముకలతోడి
ముఱికి చెత్తలు చేర్చి - మూట కట్టె
తే. నీ శరీరాలు పడిపోవు - టెఱుగ కేము
కాముకుల మైతి మిక మిమ్ము - గానలేము.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
083
సీ. గరుడవాహన | దివ్య - కౌస్తుభాలంకార |
రవికోటితేజ | సా - రంగవదన |
మణిగణాన్విత | హేమ - మకుటాభరణ | చారు
మకరకుండల | లస - న్మందహాస |
కాంచనాంబర | రత్న - కాంచివిభూషిత |
సురవరార్చిత | చంద్ర - సూర్యనయన |
కమలనాభ | ముకుంద | - గంగాధరస్తుత |
రాక్షసాంతక | నాగ - రాజశయన |
తే. పతితపావన | లక్షీశ | - బ్రహ్మజనక |
భక్తవత్సల | సర్వేశ | - పరమపురుష |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
084
సీ. పలుమాఱు దశరూప - ములు దరించితి వేల?
యేకరూపము బొంద - వేల నీవు?
నయమున క్షీరాబ్ధి - నడుమ జేరితి వేల?
రత్నకాంచన మంది - రములు లేవె?
పన్నగేంద్రునిమీద - బవ్వళించితి వేల?
జలతారుపట్టెమం - చములు లేవె?
ఱెక్కలు గలపక్షి - నెక్కసాగితి వేల?
గజతురంగాందోళి - కములు లేవె?
తే. వనజలోచన | యిటువంటి - వైభవములు
సొగసుగా నీకు దోచెనో - సుందరాంగ?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
085
సీ. తిరుపతి స్థలమందు - దిన్నగా నే నున్న
వేంకటేశుడు మేత - వేయలేడొ?
పురుషోత్తమమున కే - బోయనజాలు జ
గన్నాథు డన్నంబు - గడపలేడొ?
శ్రీరంగమునకు నే - జేర బోయిన జాలు
స్వామి గ్రాసము బెట్టి - సాకలేడొ?
కాంచీపురములోన - గదిసి నే గొలువున్న
గరివరదుడు పొట్ట - గడపలేడొ?
తే. యెందు బోవక నేను నీ - మందిరమున
నిలిచితిని నీకు నామీద - నెనరు లేదు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
086
సీ. తార్క్ష్యవాహన | నీవు - దండిదాత వటంచు
గోరి వేడుక నిన్ను - గొల్వవచ్చి
యర్థిమార్గమును నే - ననుసరించితినయ్య
లావైన బదునాల్గు - లక్ష లైన
వేషముల్ వేసి నా - విద్యాప్రగల్భత
జూపసాగితి నీకు - సుందరాంగ |
యానంద మైన నే - నడుగ వచ్చిన దిచ్చి
వాంఛ దీర్పుము - నీలవర్ణ | వేగ
తే. నీకు నావిద్య హర్షంబు - గాక యున్న
తేపతేపకు వేషముల్ - దేను సుమ్మి.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
087
సీ. అమరేంద్రవినుత | నే - నతిదురాత్ముడ నంచు
గలలోన నైనను - గనుల బడవు
నీవు ప్రత్యక్షమై - నులువకుండిన మానె
దొడ్డగా నొక యుక్తి - దొరకెనయ్య |
గట్టికొయ్యను దెచ్చి - ఘనముగా ఖండించి
నీస్వరూపము చేసి - నిలుపుకొంచు
ధూప దీపము లిచ్చి - తులసితో బూజించి
నిత్యనైవేద్యముల్ - నేమముగను
తే. నడుపుచును నిన్ను గొలిచెద - నమ్మి బుద్ధి
నీ ప్రపంచంబు గలుగు నా - కింతె చాలు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
088
సీ. భువనేశ | గోవింద | - రవికోటిసంకాశ |
పక్షివాహన | భక్త - పారిజాత |
యంభోజభవ రుద్ర - జంభారిసన్నుత |
సామగానవిలోల | - సారసాక్ష |
వనధిగంభీర | శ్రీ - వత్సకౌస్తుభవక్ష |
శంఖచక్రగదాసి - శార్ఙ్ఞహస్త |
దీనరక్షక | వాసు - దేవ | దైత్యవినాశ |
నారదార్చిత | దివ్య - నాగశయన |
తే. చారు నవరత్నకుండల - శ్రవణయుగళ |
విబుధవందిత పాదబ్జ | - విశ్వరూప |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
089
సీ. నాగేంద్రశయన | నీ - నామమాధుర్యంబు
మూడుకన్నుల సాంబ - మూర్తి కెఱుక
పంకజాతాక్ష | నీ - బలపరాక్రమ మెల్ల
భారతీపతి యైన - బ్రహ్మ కెఱుక
మధుకైటభారి | నీ - మాయాసమర్థత
వసుధలో బలిచక్ర - వర్తి కెఱుక
పరమాత్మ | నీ దగు - పక్షపాతిత్వంబు
దశశతాక్షుల పురం - దరుని కెఱుక
తే. వీరి కెఱుకగు నీకథల్ - వింత లెల్ల
నరుల కెఱు కన్న నెవరైన - నవ్విపోరె?
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
090
సీ. అర్థు లేమైన ని - న్నడుగవచ్చెద రంచు
క్షీరసాగరమందు - జేరినావు
నీచుట్టు సేవకుల్ - నిలువకుండుటకునై
భయదసర్పముమీద - బండినావు
భక్తబృందము వెంట - బడి చరించెద రంచు
నెగసి పోయెడిపక్షి - నెక్కినావు
దాసులు నీద్వార - మాసింపకుంటకు
మంచి యోధుల కావ - లుంచినావు
తే. లావు గలవాడ వైతి వే - లాగు నేను
నిన్ను జూతును నాతండ్రి | - నీరజాక్ష |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
091
సీ. నీకథల్ చెవులలో - సోకుట మొదలుగా
బులకాంకురము మెన - బుట్టువాడు
నయమైన నీ దివ్య - నామకీర్తనలోన
మగ్నుడై దేహంబు - మఱచువాడు
ఫాలంబుతో నీదు - పాదయుగ్మమునకు
బ్రేమతో దండ మ - ర్పించువాడు
హా పుండరీకాక్ష | - హా రామ | హరి | యంచు
వేడ్కతో గేకలు - వేయువాడు
తే. చిత్తకమలంబునను నిన్ను - జేర్చువాడు
నీదులోకంబునం దుండు - నీరజాక్ష |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
092
సీ. నిగమగోచర | నేను - నీకు మెప్పగునట్లు
లెస్సగా బూజింప - లేను సుమ్మి
నాకు దోచిన భూష - ణములు పెట్టెద నన్న
గౌస్తుభమణి నీకు - గలదు ముందె
భక్ష్యభోజ్యముల న - ర్పణము జేసెద నన్న
నీవు పెట్టితి సుధ - నిర్జరులకు
గలిమికొద్దిగ గాను - కల నొసంగెద నన్న
భార్గవీదేవి నీ - భార్య యయ్యె
తే. నన్ని గలవాడ వఖిల లో - కాధిపతివి |
నీకు సొమ్ములు పెట్ట నే - నెంతవాడ |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
093
సీ. నవసరోజదళాక్ష | - నన్ను బోషించెడు
దాతవు నీ వంచు - ధైర్యపడితి
నా మనంబున నిన్ను - నమ్మినందుకు దండ్రి |
మేలు నా కొనరింపు - నీలదేహ |
భళిభళీ | నీ యంత - ప్రభువు నెక్కడ జూడ
బుడమిలో నీ పేరు - పొగడవచ్చు
ముందు జేసిన పాప - మును నశింపగ జేసి
నిర్వహింపుము నన్ను - నేర్పుతోడ
తే. బరమసంతోష మాయె నా - ప్రాణములకు
నీఋణము దీర్చుకొన నేర - నీరజాక్ష |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
094
సీ. ఫణులపుట్టలమీద - బవ్వళించినయట్లు
పులుల గుంపున జేర - బోయినట్లు
మకరివర్గం బున్న - మడుగు జొచ్చినయట్లు
గంగదాపున నిండ్లు - గట్టినట్లు
చెదలభూమిని జాప - చేర బఱచినయట్లు
ఓటిబిందెల బాల - నునిచినట్లు
వెఱ్ఱివానికి బహు - విత్త మిచ్చినయట్లు
కమ్మగుడిసె మందు - గాల్చినట్లు
తే. స్వామి నీ భక్తవరులు దు - ర్జనులతోడ
జెలిమి జేసినయ ట్లైన - జేటు వచ్చు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
095
సీ. దనుజసంహార | చక్ర - ధర | నీకు దండంబు
లిందిరాధిప | నీకు - వందనంబు
పతితపావన | నీకు - బహునమస్కారముల్
నీరజాతదళాక్ష | - నీకు శరణు
వాసవార్చిత | మేఘ - వర్ణ | నీకు శుభంబు
మందరధర | నీకు - మంగళంబు
కంబుకంధర | శార్జ్గ - కర | నీకు భద్రంబు
దీనరక్షక | నీకు - దిగ్విజయము
తే. సకలవైభవములు నీకు - సార్వభౌమ |
నిత్యకల్యాణములు నగు - నీకు నెపుడు.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
096
సీ. మత్స్యావతార మై - మడుగులోపల జొచ్చి
సోమకాసురు ద్రుంచి - చోద్యముగను
దెచ్చి వేదము లెల్ల - మెచ్చ దేవతలెల్ల
బ్రహ్మ కిచ్చితి వీవు - భళి | యనంగ
నా వేదముల నియ్య - నాచారనిష్ఠల
ననుభవించుచు నుందు - రవనిసురులు
సకలపాపంబులు - సమసిపోవు నటంచు
మనుజు లందఱు నీదు - మహిమ దెలిసి
తే. యుందు రరవిందనయన | నీ - యునికి దెలియు
వారలకు వేగ మోక్షంబు - వచ్చు ననఘ |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
097
సీ. కూర్మావతారమై - కుధరంబుక్రిందను
గోర్కితో నుండవా - కొమరు మిగుల?
వరహావతారమై - వనభూములను జొచ్చి
శిక్షింపవా హిర - ణ్యాక్షు నపుడు?
నరసింహమూర్తివై - నరభోజను హిరణ్య
కశిపుని ద్రుంపవా - కాంతి మీఱ?
వామనరూపమై - వసుధలో బలిచక్ర
వర్తి నఱంపవా - వైర ముడిగి?
తే. యిట్టి పను లెల్ల జేయగా - నెవరికేని
తగునె నరసింహ | నీకిది - దగును గాక |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
098
సీ. లక్ష్మీశ | నీదివ్య - లక్షణగుణముల
వినజాల కెప్పుడు - వెఱ్ఱినైతి
నా వెఱ్ఱిగుణములు - నయముగా ఖండించి
నన్ను రక్షింపు మో - నళిననేత్ర |
నిన్ను నే నమ్మితి - నితరదైవముల నే
నమ్మలే దెప్పుడు - నాగశయన |
కాపాడినను నీవె - కష్టపెట్టిన నీవె
నీపాదకమలముల్ - నిరత మేను
తే. నమ్మియున్నాను నీపాద - నళినభక్తి
వేగ దయచేసి రక్షింపు - వేదవిద్య |
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
099
సీ. అమరేంద్రవినుత | ని - న్ననుసరించినవారు
ముక్తి బొందిరి వేగ - ముదముతోను
నీపాదపద్మముల్ - నెఱ నమ్మియున్నాను
నాకు మోక్షం బిమ్ము - నళిననేత్ర |
కాచి రక్షించు నన్ - గడతేర్చు వేగమే
నీ సేవకుని జేయు - నిశ్చలముగ
గాపాడినను నీకు - గైంకర్యపరుడ నై
చెలగి నీపనులను - జేయువాడ
తే. ననుచు బలుమాఱు వేడెద - నబ్జనాభ |
నాకు బ్రత్యక్ష మగుము నిన్ - నమ్మినాను.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |
100
సీ. శేషప్ప యను కవి - చెప్పిన పద్యముల్
చెవుల కానందమై - చెలగుచుండు
నే మనుజుండైన - నెలమి నీ శతకంబు
భక్తితో విన్న స - త్ఫలము గలుగు
జెలగి యీ పద్యముల్ - చేర్చి వ్రాసినవారు
కమలాక్షుకరుణను - గాంతు రెపుడు
నింపుగా బుస్తకం - బెపుడు బూజించిన
దురితజాలంబులు - దొలగిపోవు
తే. నిద్ది పుణ్యాకరం బని - యెపుడు జనులు
గషట మెన్నక పఠియింప - గలుగు ముక్తి.
భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
దుష్టసంహార | నరసింహ - దురితదూర |