అన్నమయ్య కీర్తన నారాయణాచ్యుత
నారాయణాచ్యుతానంత గోవింద హరి |
సారముగ నీకునే శరణంటిని ||
చలువయును వేడియును నటల సంసారంబు
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ |
ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు
పులుసు దీపును గలపి భుజియించినట్లు ||
పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు
తగుమేను పొడచూపు తనుదానె తొలగు |
నగియించు నొకవేళ నలగించు నొకవేళ
వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు ||
యిహము పరమును వలెనె యెదిటికల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని |
సహజ శ్రీ వేంకటేశ్వర నన్ను కరుణింప
బహువిధంబుల నన్ను పాలించవే ||